భారత్-ఉజ్బెకిస్థాన్ మిలిటరీ ఎక్సర్‌సైజ్
భారత్-ఉజ్బెకిస్థాన్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడో ఎడిషన్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ మార్చి 22న ప్రారంభమైంది. ఉజ్బెకిస్థాన్‌లోని యాంగీయారిక్‌లో డస్ట్‌లిక్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఎక్సర్‌సైజ్ మార్చి 31 వరకు కొనసాగనుంది. ఇరుదేశాలు జాతీయ పతాకాలను ఎగురవేసి, జాతీయ గీతాలను ఆలపించి ఈ ఎక్సర్‌సైజ్‌ను ప్రారంభించాయి. గత ఏడాది రెండో ఎడిషన్ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌ను భారత్‌లో నిర్వహించారు.
భారత్-జపాన్ ప్రధానుల సమావేశం
మార్చి 19, 20 తేదీల్లో ఢిల్లీలో భారత్-జపాన్ ప్రధానుల 14వ శిఖరాగ్ర
సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య మొత్తం ఆరు అంశాలపై ఒప్పందం
కుదిరింది. రానున్న ఐదేండ్లలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 3.2 లక్షల కోట్లకు
చేరుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
హ్యాపీనెస్ సూచీలో భారత్@136
వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి 146 దేశాలతో మార్చి 20న
హ్యాపీనెస్ సూచీని ప్రకటించింది. ఈ జాబితాలో ఫిన్‌లాండ్ అగ్రస్థానంలో
నిలిచింది. ఆ తర్వాత డెన్మార్క్ 2, ఐస్‌లాండ్ 3, స్విట్జర్లాండ్ 4వ
స్థానాల్లో ఉన్నాయి. భారత్ 136వ స్థానంలో నిలిచింది. చివరి మూడు
స్థానాల్లో లెబనాన్ (144), జింబాబ్వే (145), అఫ్గానిస్థాన్ (146)
ఉన్నాయి. ఈ ఏడాది హ్యాపీనెస్ డే థీమ్.. ప్రశాంతంగా ఉండండి, నిజాయితీతో
ఉండండి, జాలీగా ఉండండి.
డెన్నిస్ పార్నెల్ సలివాన్
అమెరికాకు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త డెన్నిస్ పార్నెల్ సలివాన్‌కు
2022 ఏడాదికి గాను ఏబెల్ బహుమతి లభించింది. బీజ గణితం, రేఖా గణితం,
డైనమిక్ అంశాల్లో చేసిన విశ్లేషణలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
ఓస్లోలోని నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ మార్చి 23న
సలివాన్‌కు ఈ అవార్డును ప్రకటించింది. నార్వే ప్రభుత్వం 2003 నుంచి ఈ
అవార్డును ప్రదానం చేస్తున్నది. ఈ బహుమతి కింద 3.7 మిలియన్ డాలర్ల నగదు
అందజేస్తారు. ఇది గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి.
షహబుద్దీన్ అహ్మద్
బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షహబుద్దీన్ అహ్మద్ మార్చి 24న మరణించారు.
1996 నుంచి 2001 వరకు ఆయన బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991
ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛాయుత, విశ్వసనీయ ఎన్నికల నిర్వహణలో
షహబుద్దీన్ పూర్తి బాధ్యత వహించారు.
రమేశ్‌చంద్ర లహోటి
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌చంద్ర లహోటి మార్చి
22న మరణించారు. ఆయన సుప్రీంకోర్టుకు 35వ చీఫ్ జస్టిస్‌గా 2004, జూన్ 1
నుంచి 2005, నవంబర్ 1 వరకు పనిచేశారు. లహోటి 1940 నవంబర్ 1న
మధ్యప్రదేశ్‌లో జన్మించారు. 1960లో గుణ జిల్లా బార్ అసోషియేషన్‌లో చేరి,
1962లో అడ్వకేట్‌గా నమోదయ్యారు. 1988, మే 3న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు
న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఏడాది ఆగస్టు 4న శాశ్వత
న్యాయవాదిగా నమోదయ్యారు. 1994, ఫిబ్రవరి 7న ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
అయ్యారు. 1998, డిసెంబర్ 9న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
మరియో మార్సెల్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చిలీ గవర్నర్ మరియో మార్సెల్‌కు సెంట్రల్
బ్యాంకింగ్ అవార్డ్స్-2022లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
ఆయన 2016 అక్టోబర్ నుంచి చిలీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా
పనిచేస్తున్నారు. మరియో మార్సెల్ లాటిన్ అమెరికా దేశాల్లోనే అత్యంత
పేరున్న బ్యాంకింగ్ అధికారి.
హిసాషి టెకౌచి
మారుతి సుజుకి సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా హిసాషి టెకౌచి
మార్చి 24న నియమితులయ్యారు. ఈయన 1966లో సుజుకి మోటార్ కార్పొరేషన్‌లో
చేరారు. 1997 నుంచి ఆస్ట్రేలియాలో కంపెనీకి మార్కెటింగ్ అండ్ సేల్స్
డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2021లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
పదోన్నతి పొందారు. కంపెనీ నూతన సీఈవోగా ఆయన ఏప్రిల్ 1న బాధ్యతలు
స్వీకరించారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న కెనిచి అయుకవ పదవీకాలం
ఈ నెల 31న ముగియనుండటంతో ఆయన స్థానంలో హిసాషిని నియమించారు.
జెన్స్ స్టోల్టెన్‌బర్గ్
నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పదవీకాలాన్ని 2023,
సెప్టెంబర్ 23వరకు పొడిగించారు. ఈ మేరకు మార్చి 24న నాటో ఒక ప్రకటన
చేసింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పాటైన నాటోలో ప్రస్తుతం సభ్యదేశాల
సంఖ్య 30గా ఉన్నది. నార్వే మాజీ ప్రధాని అయిన స్టోల్టెన్‌బర్గ్ 2014 నుంచి
నాటో సెక్రటరీ జనరల్‌గా కొనసాగుతున్నారు. కాగా, స్టోల్టెన్‌బర్గ్
పదవీకాలాన్ని పొడిగించడం ఇది వరుసగా రెండోసారి.
టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన అష్లీ బార్టీ
ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి, ఆస్ట్రేలియాకు చెందిన అష్లీ
బార్టీ 25 ఏండ్లకే ఆటకు గుడ్‌బై చెప్పింది. ఈ మేరకు మార్చి 23న ఆమె తన
నిర్ణయం ప్రకటించింది. అష్లీ బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్,
2021లో వింబుల్డన్ టైటిల్, 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్
గెలిచింది.
ఫైనల్లో ఓడిన లక్ష్యసేన్
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ-2022లో భారత క్రీడాకారుడు లక్ష్యసేన్ తృటిలో టైటిల్ చేజార్చుకున్నాడు. అలవోకగా ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆయన ఫైనల్లో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అలెక్సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఉత్తరాఖండ్ రాష్ర్టానికి చెందిన లక్ష్యసేన్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో లక్ష్యసేన్ కాంస్యం సాధించాడు.